Tuesday, March 28, 2006

 

కదలికలను కనిపెట్టే సెల్

యజమాని కదలికలను గుర్తుంచుకొనే పరికరాలతో కూడిన సెల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇలాంటి సదుపాయం ఉన్న సెల్ ఫోనును ఎవరైనా దొంగిలిస్తే ఏమవుతుందే తెలుసా ? ఆ పరికరంలో ముందే నమోదయి ఉన్న యజమాని కదలికలతో పోల్చి చూసి ఆ సెల్ ఫోను పని చేయడం మానేస్తుంది. ఫిన్లాండ్ దేశానికి చెందిన విటిటి టెక్నాలజీస్ అనే సంస్ధ చేసిన కృషి ఫలితం ఇది (నా ఉద్దేశమేంటంటే... ఎవరైనా దొంగిలించినప్పుడు పనిచేయకపోవడం సంగతి అటుంచి ఒక రకమైన శబ్దం చేస్తే దొంగను పట్టుకోవచ్చు కదా... ఇలాంటి సందేహం ఇప్పటికే చాలామందికి వచ్చి ఈ పాటికే కంపెనీవారి చెవిన పడే ఉంటుంది. కనుక కొత్త మరో కొత్త సదుపాయం వస్తుందేమో చూద్దాం).

 

దారిచూపే దేవత...

అదో చిన్న పాకెట్ పీసీ.... మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ చిరునామా దానికివ్వండి. మీరు ఎలా వెళితే తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోగలరో ఆ దారి వివరాలిస్తుంది. దారి తప్పకుండా మార్గదర్శకత్వం కూడా ఇస్తుంది. నిప్పన్ ఆడియోట్రానిక్స్ అనే సంస్థ తయారు చేసిన ఈ పరికరం పేరు నిప్పన్ శాటిగైడ్. ప్రస్తుతానికి ముంబాయి, ఢిల్లీ, హైదరాబాదు నగరాల్లో మాత్రమే పనిచేసే ఈ సాధనం పరిధి మున్ముందు ఇతర పట్టణాలకూ విస్తరించవచ్చు. ఇందులో టచ్ స్క్రీన్ వసతి కూడా ఉంది.

Saturday, March 25, 2006

 

లక్ష రూపాయల కారు వచ్చేసిందోచ్

లక్ష రూపాయలలోపు ఖరీదు చేసే కారు కోసం జనం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, పారిశ్రామిక సంస్థల వాగ్దానాలు కార్యరూపం దాల్చేలోగా అలాంటి కారును ఓ విద్యార్థి సిద్ధం చేసేశాడు. మధురలోని జిఎల్‌ఎ ఇంజనీరింగ్‌ మరియు టెక్నాలజి కళాశాల విద్యార్థి ప్రదీప్‌ కుమార్‌ రాహి ఈ ఘనకార్యాన్ని సాధించాడు. 525 కిలోల బరువు గల ఈ కారు బ్యాటరీ ఆధారంగా గంటకు సుమారు 66 కిమీ గరిష్ట వేగంతో దూసుకెళుతుంది. పూర్తిగా ఛార్జిలో ఉన్నప్పుడు 110 కిలోమీటర్ల మైలేజినివ్వగలదు. ప్రదీప్‌ ఇచ్చిన వివరాల ప్రకారం కిలో మీటరుకు 37 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. తమ విద్యార్థి రూపొందించిన ఈ కారును వాణిజ్య విక్రయాలకు సిద్ధం చేయాలనుకుంటే చేయూతనిస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది.

Thursday, March 16, 2006

 

భూకంపాలను గుర్తించే సోడార్

ప్రకృతి వైపరీత్యాలతో ఎవరెప్పుడు మృత్యువాత పడతారో తెలీదు. అందులోనూ భూకంపం రాక ఊహించనలవి కాదు. ఈ నేపథ్యంలో భారత శాస్త్రవేత్తలు కనిపెట్టిన సోనిక్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (సోడార్) పరికరం మనకో అద్భుత వరం. అమర్చిన చోటు నుంచి 250 కి.మీ పరిధిలో భూకంపాలు ఏర్పడే అవకాశాలను కొద్ది గంటల ముందే ఈ సాధనం పసిగట్టి సమాచారాన్నిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ సంస్థల పరిశోధకులు, శాస్త్రవేత్తల ఘనత ఇది.

 

భాషలను గుర్తించే పెన్ కీబోర్డ్

ఇంగ్లీష్ తెలీదని, టైపింగ్ రాదని బాధపడొద్దు. ఈ పెన్ కీబోర్డ్ ఉంటే చాలు, దాంతో మీరు ఏ భాషలోనైనా రాసుకొని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసుకోవచ్చు. హ్యూలెట్ ప్యాకర్డ్ సంస్థ నుంచి వచ్చిన ఈ నూతన ఆవిష్కరణ త్వరలో సంచలనం సృష్టించనుంది. ప్రస్తుతానికి కన్నడ భాషను గుర్తిస్తున్న ఈ సాధనం మున్ముందు దేవనాగరి, తమిళ భాషల దిశగా సాగుతుంది. ఆ తర్వాత ఇతర భారతీయ భాషలనూ ఆక్రమించుకోవచ్చు. ఈ విషయం ఈ రోజు పత్రికల్లో చదివాను.

 

కొత్త ప్రపంచం

మనల్ని సృష్టించిన ఆ దేవుడు మనకిచ్చిన సృజనాత్మకతతో ప్రతిరోజూ ఎన్నెన్నో సృష్టిస్తున్నాం. గుట్టుగా ఉన్నవి కనిపెట్టి మిగతా ప్రపంచానికి తెలియజెబుతున్నాం. ఆ సమాచారాన్ని అందరికీ పంచే బుల్లి ప్రయత్నమే ఇది.

This page is powered by Blogger. Isn't yours?