Monday, November 29, 2010

 

త్వరలో

త్వరలో...

Saturday, November 28, 2009

 

అతి చిన్న సైకిల్

అతి పెద్ద చెక్క గడియారం, అతిపెద్ద పెన్ రూపొందించి ఇప్పటికే లిమ్కా బుక్ రికార్డులకెక్కిన హైదరాబాద్ వాసి అశోక్ తాజాగా మరో ఆవిష్కరణతో ముందుకొచ్చారు. అదేమిటంటే... అత్యంత చిన్న చక్రాలు కలిగిన సైకిల్. దీని ఎత్తు కేవలం 14 అంగుళాలు, వెడల్పు 5న్నర అంగుళాలు, పొడవు 36 అంగుళాలు, ముందు చక్రం 6.63 మిల్లీ మీటర్లు (0.26 అంగుళాలు), వెనుక చక్రం 7.85 మిల్లీ మీటర్లు (0.30 అంగుళాలు). దీనిపై ప్రయాణించి గిన్నీస్ బుక్ ఎక్కాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ అశోక్.

Thursday, October 29, 2009

 

గాలి వీస్తే ఛార్జింగ్ అయినట్టే...

విద్యుత్ లేకుంటేనేం... పవన విద్యుత్ సాయంతో సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకోండి అని పిలుపునిస్తున్నారు పాండిచ్చేరి లాస్‌పేట పాలిటెక్నిక్ మహిళా కళాశాల ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విద్యార్థినులు. ఈ కళాశాలకు చెందిన అష్టలక్ష్మి, ప్రియ, చార్మిరోస్, విజయలక్ష్మి, శ్రీదేవి, తమిళ్ సెల్వి ఒక జట్టుగా ఏర్పడి పవన విద్యుత్ ఆధారంగా పనిచేసే సెల్ ఛార్జర్‌ని కనిపెట్టారు. చాలా చిన్న ఫ్యాన్ జోడించిన మోటార్ ద్వారా ఇది పనిచేస్తుంది. బలంగా గాలి వీచినప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతూండగా ఎలక్ట్రిక్ జనరేటర్ తరహాలో ఈ మోటార్ ఉత్పత్తి చేసే విద్యుచ్ఛక్తితో బ్యాటరీ ఛార్జి సర్క్యూట్ పని చేస్తుంది. దీంతో బ్యాకప్ బ్యాటరీని సులువుగా ఛార్జి చెయ్యవచ్చంటున్నారు ఈ విద్యార్థినులు. ముఖ్యంగా వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఈ పరికరం వైరును సెల్‌కు తగిలించి, దానికి (పరికరానికి) ఎదురుగాలి వీచేలా ఉంచితే ఫ్యాన్ వేగంగా తిరుగుతూ ఛార్జింగ్ చేసేస్తుంది. తొలుత నోకియా సెట్లలోని 3.7 వోల్ట్ బ్యాటరీకి ఛార్జి చేసేలా దీనిని తయారు చేశారు. భవిష్యత్తులో దీని సామర్థ్యం పెంచుతామని విద్యార్థినులు చెప్పారు.

 

అరచేతిలో ఫంకా

బుర్ర పాదరసంలా పని చేస్తే... బోలెడు ఆవిష్కరణలు చెయ్యొచ్చు. అందుకు ఉదాహరణ తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళెంకు చెందిన అరుణ్ పాంఢ్యన్ (17). ఇతనికి 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే బ్యాటరీ సాయంతో పనిచేసేలా అరచేతిలో పట్టేంత ఫంకా (ఫ్యాన్)ను తయారు చేశాడు. అరుణ్ తండ్రి గణేశన్ ఒక మిల్లులో పనిచేస్తున్నారు. తల్లి భవాని ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇక్కడి అన్నప్పరాజా స్మారక ఉన్నత పాఠశాలలో చదివిన పాండ్యన్ తన పాఠశాలలోని గ్రంథాలయ నిర్వాహకుడు సుబ్రమణ్యం సాయంతో ఎన్నో శాస్త్ర సాంకేతిక విషయాలు తెలుసుకుని ఆయనిచ్చిన స్ఫూర్తి, ప్రోత్సాహంతో ముందడుగేశాడు. తాను నేర్చుకున్న విషయాలను తనకంటే పై తరగతి విద్యార్థులకు సైతం బోధించాడు. ఇతన్ని ఆదర్శంగా తీసుకున్న పలువురు విద్యార్థులు తమ దృష్టిని పరిశోధనలవైపు మళ్లించారు. నవలోకమంటే ఎక్కడో లేదు. ఇక్కడే ఉంది.

Saturday, October 14, 2006

 

దీపావళి బాంబులకు రిమోట్...

దీపావళి అంటే అందరికీ బాణాసంచా కాల్చాన్న ముచ్చట ఉన్నా బాంబులు పేల్చడానికి భయపడే వాళ్లే ఎక్కువ. అందుకే చెన్నైకి చెందిన సిలికాన్ ల్యాబ్స్ లిమిటెడ్ సంస్థ బాంబులను చిన్నపిల్లలు, ముసలివాళ్లు సైతం రిమోట్ ద్వారా పేల్చి వారి సరదాను తీర్చుకునేందుకు వీలుగా ఒక పరికరాన్ని రూపొందించింది. మీరు పేల్చాలనుకున్న బాంబు వత్తిని ఈ పరికరానికి ముందు భాగంలో ఉన్న చిన్న పెట్టెలో ఉంచి, రిమోట్ సాయంతో గరిష్టంగా 30 మీటర్ల దూరం నుంచి పేల్చవచ్చు. ఎన్ని సార్లయినా వాడుకొనేందుకు వీలుగా రూపొందించిన ఈ పరికరం ధరను రూ.1200గా నిర్ణయించినట్లు సంస్థ ఎండీ నారాయణన్ చెప్పారు. ఇది కావాలనుకుంటే...044-32542525, 22396762 నెంబర్లకు ఫోన్ చెయ్యండి.

Wednesday, September 27, 2006

 

కృత్రిమ గుండె వచ్చిందట...

టైటానియం, ప్లాస్టిక్ పదార్థాలతో తయారైన కృత్రిమ హృదయం హృద్రోగులకు చేరువ కానుంది. సుమారు 900 గ్రాముల బరువుండే ఈ గుండెలోనూ మమూలు గుండెలో ఉన్నట్లే నాలుగు గదులు, రక్తాన్ని సరఫరా చేసే కవాటాలూ ఉన్నాయి. శరీరంలోనే అమర్చి ఉండే బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ గుండె, రక్త సరఫరాకు కావలసిన మేరకు ఒత్తిడిని కలుగచేసేందుకు 10 వేల భ్రమణాలు చేస్తుందట. అయితే, దీని బ్యాటరీకి కావలసిన రీఛార్జి మాత్రం శరీరానికి తగిలించుకోగల మరో పరికరం ద్వారా బయటి నుంచే అందుతుందట. ఇదిలా ఉంటే, పొట్టలోనే ఉండే మరో పరికరం గుండె వేగం, రక్త సరఫరా నియంత్రణకు తోడ్పడనుండగా, విద్యుత్ సరఫరా నియంత్రణకు మరో పరికరం ఉంటుందట. ప్రస్తుతానికి కోటీశ్వరులైన రోగుల కోసమే ఎదురు చూస్తున్న ఈ గుండెకు మానవత్వం తోడైతే త్వరలోనే లక్షాధికారుల చెంతకూ రావచ్చు. ఈ వార్త అందే సమయానికి అమెరికా వైద్య రంగం దీనిని అంతర్జాతీయ మార్కెట్‌లోకి పంపే పనిలో ఉన్నారట.

Friday, April 28, 2006

 

కోడి రెట్ట నుంచి కరెంటంట...

కాదేది విద్యుదుత్పత్తికి అనర్హమనడంలో తప్పులేదనిపిస్తోంది. ఎందుకంటే పారిశ్రామిక వ్యర్ధాల నుంచి విద్యుదుత్పత్తి అనే అంశంపై గురువారం (28 ఏప్రిల్ 2006) రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ హైదరాబాదులో నిర్వహించిన సదస్సులో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకొచ్చాయి. కోళ్లు విడిచే వ్యర్ధాల (వీటిలో ఊక ఉన్నందున) నుంచి కూడా విద్యుదుత్పత్తి చేయవచ్చని తేలడంతో ఈ తరహా ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. ఈ విద్యుదుత్పత్తి ప్రక్రియలో బయటకొచ్చే బూడిదను ఎరువుగా కూడా వాడుకోవచ్చట. ఇంతే కాదండోయ్... పట్టణ ప్రాంతాల్లోని చెత్త నుంచి కూడా విద్యుదుత్పత్తి చేసే దిశగా ప్లాంట్లను నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tuesday, March 28, 2006

 

కదలికలను కనిపెట్టే సెల్

యజమాని కదలికలను గుర్తుంచుకొనే పరికరాలతో కూడిన సెల్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇలాంటి సదుపాయం ఉన్న సెల్ ఫోనును ఎవరైనా దొంగిలిస్తే ఏమవుతుందే తెలుసా ? ఆ పరికరంలో ముందే నమోదయి ఉన్న యజమాని కదలికలతో పోల్చి చూసి ఆ సెల్ ఫోను పని చేయడం మానేస్తుంది. ఫిన్లాండ్ దేశానికి చెందిన విటిటి టెక్నాలజీస్ అనే సంస్ధ చేసిన కృషి ఫలితం ఇది (నా ఉద్దేశమేంటంటే... ఎవరైనా దొంగిలించినప్పుడు పనిచేయకపోవడం సంగతి అటుంచి ఒక రకమైన శబ్దం చేస్తే దొంగను పట్టుకోవచ్చు కదా... ఇలాంటి సందేహం ఇప్పటికే చాలామందికి వచ్చి ఈ పాటికే కంపెనీవారి చెవిన పడే ఉంటుంది. కనుక కొత్త మరో కొత్త సదుపాయం వస్తుందేమో చూద్దాం).

 

దారిచూపే దేవత...

అదో చిన్న పాకెట్ పీసీ.... మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ చిరునామా దానికివ్వండి. మీరు ఎలా వెళితే తక్కువ సమయంలో గమ్యస్థానం చేరుకోగలరో ఆ దారి వివరాలిస్తుంది. దారి తప్పకుండా మార్గదర్శకత్వం కూడా ఇస్తుంది. నిప్పన్ ఆడియోట్రానిక్స్ అనే సంస్థ తయారు చేసిన ఈ పరికరం పేరు నిప్పన్ శాటిగైడ్. ప్రస్తుతానికి ముంబాయి, ఢిల్లీ, హైదరాబాదు నగరాల్లో మాత్రమే పనిచేసే ఈ సాధనం పరిధి మున్ముందు ఇతర పట్టణాలకూ విస్తరించవచ్చు. ఇందులో టచ్ స్క్రీన్ వసతి కూడా ఉంది.

This page is powered by Blogger. Isn't yours?